-ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బాధితులు…
హుజురాబాద్/ జూన్ 27(మా అక్షరం) : దళిత బందు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రెండో విడత సాధన సమితి ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ… దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని ఆరోపించారు. దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించి దళిత బంధు ను నిలిపివేశాడని అన్నారు. కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా దళిత బంధు రెండో విడత నిధులను మంజూరు చేయాలని వారు కోరారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంప్ లోని ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్, కోలుగూరి నరేష్, రామంచ రాకేష్, అకినపెల్లి ఆకాష్, దసరాపు నాగరాజు, రక్షిత్, బిక్షపతి, అరుణా, సరిత, రీటా తదితరులు పాల్గొన్నారు.











