హుజురాబాద్/ జూలై 16 (మా అక్షరం): సైదాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యకర్త కొయ్యేడ మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడి కుటుంబ సభ్యులను బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్, ఛీఫ్ జోన్ ఇన్‌చార్జి అడ్వకేట్ నిషాని రామచంద్రం, ఇతర నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అంత్యక్రియల నిర్వహణ కోసం పార్టీ కార్యకర్తల తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ప్రమాదంలో గాయపడిన మధు కుమార్తె అక్షిత (8)ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆమెకు ఉత్తమ వైద్యం అందించాలని నిషాని రామచంద్రం వైద్యులను కోరారు.మధు మరణానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు బీమా తప్పనిసరి చేసేలా పోలీసులు అవగాహన కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. చింతలపల్లి గ్రామంలో రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్‌చార్జి దొడ్డే శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఇల్లెందు రమేష్, హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిలు వేల్పుల మల్లేశం, అంబాల ప్రభు, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్, కండె తిరుపతి, దొడ్డే సమ్మయ్య, బోయిని బాబు, మంద సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.












