హుజురాబాద్/జూలై14 (మా అక్షరం):మండలంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సహాయకులు, స్కావెంజర్లకు కీర్తిశేషులు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం 120 చీరలను పంపిణీ చేశారు. శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నరెడ్ల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా చీరలను అందజేసినట్లు మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా డీఈవో నరెడ్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ జగదీశ్వర్ విద్యాశాఖకు అందిస్తున్న సేవలను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించి విద్యార్థులు, విద్యాశాఖ సిబ్బందికి మరింత సహకారం అందించాలని ఆకాంక్షించారు. మధ్యాహ్న భోజన సిబ్బంది వంటగదులను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. అలాగే వారికి సంబంధించిన బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ జగదీశ్వర్ 2011 నుంచి విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించడం, పరీక్ష ప్యాడ్లు, ప్లేట్ల పంపిణీతో పాటు అనాథలు, వృద్ధులు, ఉపాధి కూలీలకు వివిధ సందర్భాల్లో అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ, తాను గుర్తింపు కోసం కాకుండా ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు, సమాజానికి తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి కర్ర అశోక్ రెడ్డి, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు దేవారం మేరీ శోభారాణి, అనురాధ, శ్రీభవాని, శస్త్ర పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ మారబోయిన వేణుమాధవ్, ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్పీలు రవిబాబు, రమేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.












