-ఆపన్న హస్తాల కోసం ఎదురుచూపు..
గూగుల్ పే, ఫోన్ పే.7386430239,
హుజురాబాద్/ సెప్టెంబర్ 25(మా అక్షరం) : మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని భార్య చేయిచాచి వేడుకుంటుంది.అతడు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని చూసి కాలం కన్నెర చేసింది. ఆ కుటుంబంలో పెద్ద దిక్కు అయిన భర్త మెదడులో రక్తం గడ్డలు కట్టి అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతదేహాన్ని యజమాని ఇంటి ముందు వేయనీయకపోవడంతో ఊరు బయట వేసి అక్కడికి వచ్చిన వారిని అంత్యక్రియలకు సహాయం చేయాల్సిందిగా చేయి చాచి వేడుకుంటుంది. ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న వారు అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అని ప్రతి ఒక్కరు అంటున్నారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామంలో కోట లక్ష్మణ్, ప్రేమలత అనే భార్యాభర్తలు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూలీనాలీ చేసుకుని జీవితాన్ని వెల్లదీస్తున్నారు. కూలీ చేస్తూనే ఇద్దరు భార్యాభర్తలు తమ ఇద్దరు కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. మంగళవారం అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోవడంతో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి సమయం పట్టింది. చివరకు గ్రామస్తుల సహాయంతో ఎంజీఎంకు తీసుకెళ్లింది.అక్కడే లక్ష్మణ్ మృతి చెందాడు.మృతదేహాన్ని తీసుకువస్తుండగా తమ ఇంటిముందు వేయకూడదని యజమాని తెలిపారు.ఏo చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఊరి బయటనే మృతదేహాన్ని చిన్న డేరా వేసి ఉంచారు. లక్ష్మణ్ మృతదేహాన్ని చూసేందుకు వస్తున్న వారిని చేయిచాచి అంత్యక్రియలకు సాయం చేయాలని భార్య ప్రేమలత వేడుకోవడం హృదయాన్ని దహించి వేస్తుంది. బంధువులు కొంత సహాయం అందించారు. ఎవరైనా స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు











