+91 99635 77856

తల్లిదండ్రుల కలలను సాకారం చేసిన తనయుడు..

-బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికైన తెలంగాణ బిడ్డ..
హుజురాబాద్/ అక్టోబర్ 24 (మా అక్షరం): తెలంగాణలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వెల్లువలా వస్తున్నాయి. వాటిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కొన్ని ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలంలొని రాంపూర్ గ్రామానికి చెందిన డా. గోసికొండ శ్రీరాములు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని సామాజిక శాస్త్ర విభాగంలో ( డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ) సహాయ ఆచార్యులు (అసిస్టెంట్ ప్రొఫెసర్) గా ఎంపికయ్యారు. చేనేత కుటుంబానికి చెందిన కీ.శే. గోసికొండ కనకలక్ష్మి – జనార్థన్ దంపతులకి వారి కుమారుడిని ప్రభుత్వ టీచర్ గా చూడాలనే ఆశయం ఉండేది. అప్పుడు శ్రీరాములు చదువే అన్నిటికీ పరిష్కారం అనుకున్నాడు… తండ్రి పొద్దంతా మగ్గం నేసిన తల్లి కూలి పనికి పోయిన ఐదు వేళ్ళూ లోపలికి వెళ్లాలంటేనే కష్టంగా ఉన్న పరిస్థితి ఉన్న కూడా తాను వెనుకడుగు వేయకుండా చదువుపై దృష్టి పెట్టాడు.. కానీ కాలం కాటేసినట్లు 2016 లో తన నాన్నను కోల్పోయాడు. ఐదు నెలల కిందట తన తల్లిని కోల్పోయాడు. అయినప్పటికీ, వారి చివరి కోరికను తీర్చడానికి, దేశంలోని ఎన్నో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు (అప్లై) చేస్తూ, ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండేవాడు. భగీరథ ప్రయత్నం చేసిన శ్రీరాములు కు దేశంలోనే పురాతనమైన, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన, అతిపెద్ద విశ్వ విద్యాలయం అయిన బెనారస్ హిందూ యూనివర్శిటీ లో ఉద్యోగం సాధించాడు. డీఎస్సీ-2006 లో రెండు మార్కుల తేడాతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేజారిపోయింది.అయినప్పటికీ, శ్రీరాములు ఏ మాత్రం కుంగిపోకుండా, యూనివర్సిటీ లో ఈ డి ను చదివిన అనంతరం ఏ సోషలాజి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశాడు. శ్రీరాములుకు చదువు పట్ల ఉన్న ఆసక్తి, పట్టుదలను గమనించిన హెచ్ సి యు ప్రొఫెసర్లు – డా. నాగరాజు గుండిమేడ, డా. చంద్రి రాఘవ రెడ్డి లు పరిశోధన వైపు అడుగులు వేసేలా ప్రొత్సహించారు. అలా ఎం ఫీల్ పీహెచ్డీ లను డా. నాగరాజు గుండిమేడ గారి మార్గదర్శకంలో పూర్తిచేశాడు. ‘సిరిసిల్ల నేతన్నల కుటుంబాల్లో విద్య’ అనే అంశంపై ఎం ఫీల్, అలాగే ‘తెలంగాణలోని ఒక పట్టణంలో ప్రైవేట్ స్కూల్ ఎంపికకు గల సామాజిక కారణాలు’ అనే అంశం పై పీహెచ్డీ పరిశోధన చేశాడు. అలా పరిశోధన చేస్తూనే కుటుంబాన్ని పోషించడానికి తన గైడ్ వద్ద ప్రాజెక్ట్ లు చేశాడు. పరిశోధన అనంతరం సికింద్రాబాద్ (అల్వాల్) లోని లయోలా కాలేజీ లో ఐదున్నర సం.లు పని చేశాడు. ఆ తర్వాత, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోనున్న ‘నర్సీ మూంజీ డీమ్డ్ యూనివర్సిటీ (NMIMS)’ గత మూడు సం.ల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది, ఈ జీవితానికి ఇంకేం కావాలని శ్రీరాములు అనుకోలేదు. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశయ సాధనకు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. డిల్లీ లో నున్న ఎన్ సి ఈ ఆర్ టి కొన్ని పేరుగాంచిన కాలేజీ ల్లో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా, ఫలితం దక్కలేదు. అయినా మొక్కవోని దీక్షతో, ఆత్మ ధైర్యం తో, సానుకూల దృక్పథంతో ఉద్యోగాలకు అప్లై చేశాడు. చివరగా బి హెచ్ యు ఉద్యోగానికి ఎంపికై, బుధవారం విధుల్లో చేరాడు. బ్రతికుండగానే తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో, తల్లిదండ్రుల మరణాంతరం కూడా వారి కలలను సాకారం చేసిన శ్రీరాములు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన విజయం పట్ల తనకు చదువు చెప్పిన గురువులు, అక్కలు, భావలు, భార్య, కొడుకు, బంధువులు, మిత్రులు, గ్రామ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !