– ఇక కార్డుల జారీ నిరంతర ప్రక్రియ..
– అర్హత కలిగిన వారందరికీ పథకాలు వర్తింపు..
– రేణికుంట గ్రామసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి..
తిమ్మాపూర్/జనవరి 22 (మా అక్షరం):రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి రేషన్ కార్డులు అందించనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారు లను గుర్తించేందుకు తిమ్మాపూర్ మండలం రేణికుంటలో బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు బీసీ సంక్షేమం, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 40 వేల వరకు రేషన్ కార్డులు ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలలకే 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసిందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులంతా కలిసి ప్రజాపంపిణీ విధానంలో ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని నిర్ణయించడం జరిగిందని, అందుకు అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరి లబ్ధిచేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామసభల్లో వెల్లడించే జాబితాల్లో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా పథకాల కోసం మళ్లీ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజాపాలన, ప్రజావాణి, ఈసేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న దరఖాస్తులను కూడా అధికారులు పరిశీలిస్తారన్నారు. పాత రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం సాగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.తాము అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని విస్పష్టం చేశారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నామని ప్రకటించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం తినడానికి పనికి బియ్యాన్ని పేదలకు అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తుందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు అందించనున్నామని, వ్యవసాయ కూలీలను ఆదుకునే ఇలాంటి పథకం తెలంగాణలో తప్ప స్వతంత్ర భారతంలో మరెక్కడా లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నాలుగు ప్రతిష్టాత్మకంగా పథకాల కింద అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఆయా పథకాల కింద దరఖాస్తు చేసుకున్న వారు పేర్లు లేవని ఆందోళన చెందవద్దని, మళ్లీ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ గ్రామసభలో రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణాశాఖామంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
హెలీపాడ్ వద్ద మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికిన కవ్వంపల్లి..
తిమ్మాపూర్ మండలం రేణికుంట లో జరిగే గ్రామసభకు హాజరయ్యేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రితో కలిసి హెలికాప్టర్లో విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లోని హెలిపాడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి స్వాగతం పలికారు.











