హుజూరాబాద్/ జూలై 27 (మా అక్షరం):నియోజకవర్గంలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వాటర్ ప్యూరిఫైర్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం రాజపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కాట్రపల్లి, కందుగుల, పెద్దపాపయ్యపల్లి, హుజూరాబాద్, హుజూరాబాద్ బాలుర, హుజూరాబాద్ బాలికల, సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తని, వారికి నాణ్యమైన విద్యతో పాటు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేలా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని దశలవారీగా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, గందె శ్రీనివాస్, తిరుమల్, ముత్యం రాజు, సర్పంచ్ మల్లారెడ్డి, రాజు, జయన్న ఫౌండేషన్ ప్రతినిధులు గుడిపాటి సరిత, జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












