హుజురాబాద్/జూలై 29 (మా అక్షరం): నియోజకవర్గంలోని ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు మహేందర్ జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలకు వస్తున్నప్పటికీ, అనేక చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, వెయిటింగ్ హాల్, కూర్చునే ఏర్పాట్లు వంటి ప్రాథమిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాయని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం విచారకరమన్నారు. అలాగే కొందరు అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని, మరికొందరు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు.నియోజకవర్గంలోని అన్ని ఎంఆర్వో, ఎంపీడీఓ కార్యాలయాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, విశాలమైన వెయిటింగ్ హాల్, కూర్చునే సదుపాయం, దివ్యాంగులకు అనుకూలమైన ర్యాంపులు తదితర మౌలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు గౌరవప్రదమైన సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.












