-దురుద్దేశంతోనే బురదజల్లుతున్నారు…
-ఆరోపణల్లో వాస్తవం లేదు.. చట్టపరంగా ఎదుర్కొంటా…
-కాంగ్రెస్ సీనియర్ నేత పత్తి కృష్ణారెడ్డి…
హుజురాబాద్/ అక్టోబర్ 14 (మా అక్షరం): రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వెంకట్రావుపల్లి సర్పంచ్ అనిత భర్త పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆధారాలు లేని ఆరోపణలతో తన ప్రతిష్టను దిగజార్చాలని చూస్తే సహించేది లేదని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.బుధవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజిని కుమార్ యాదవ్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కల్పిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అంతా చట్టబద్ధమే.. ఏ తప్పూ చేయలేదు…
వివాదంగా చిత్రీకరిస్తున్న భూ వ్యవహారంపై ఆయన స్పష్టతనిస్తూ పూర్తి వివరాలు వెల్లడించారు. 2019లోనే తన సొంత సోదరుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి నుంచి అన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి, చట్టబద్ధంగా ఎకరం నాలుగు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పత్రాలతో సహా స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని, అంతా పారదర్శకంగా జరిగిందని తేల్చిచెప్పారు.
భూమిని కాజేయాలనే కుట్ర?
ఈ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న మృతి చెందిన ఓదెలు తో గాని ఆయన కుమారునీతో గాని తనకు ఎలాంటి ప్రత్యక్ష ఆర్థిక సంబంధాలు గానీ, లావాదేవీలు గానీ లేవని కృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టారు. తన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించిన బకాయిల అంశం వచ్చినప్పుడు కూడా, కుటుంబ బాధ్యతగా ఆ బాకీ మొత్తాన్ని చెల్లించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. గతంలోనే బాకీ కింద రూ. 2.70 లక్షల చెక్కును ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, కావాలనే వారు తిరస్కరించారని గుర్తుచేశారు. బాకీ సొమ్ము తీసుకోవడం వారి ఉద్దేశం కాదని, ఎలాగైనా ఆ విలువైన భూమినే లాక్కోవాలనే దురాశతోనే కొందరి అండదండలతో ఈ రకమైన బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హద్దు మీరితే న్యాయపోరాటమే…
వాస్తవాలు ఇలా ఉంటే, రాజకీయ లబ్ధి కోసమే తనపై అసత్యాలు ప్రచారం చేస్తూ సమాజంలో తన పరువు తీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలను తక్షణమే మానుకోవాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలకు వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు.












