-బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్…
-సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం…
హుజూరాబాద్/ అక్టోబర్ 15 (మా అక్షరం): రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. గురువారం హుజూరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ, ఆ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా మళ్లించడంలో ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించలేదని ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే భయంతో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి భవిష్యత్తులో అన్నదాతలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని, దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.వేసవికి ముందే విద్యుత్ కోతలు ఎదురవుతున్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. విద్యుత్ కోతలతో గృహ వినియోగదారులు, వ్యాపారులు మళ్లీ ఇన్వర్టర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతోపాటు, సాగు, తాగునీటి సరఫరాకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యమివ్వడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు, రైతులు, కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బండ శ్రీనివాస్ హెచ్చరించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, ఇరుమళ్ల సురేందర్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, కటుకూరి మల్లారెడ్డి, వర్థినేని రవీందర్ రావు, తాళ్లపల్లి శ్రీనివాస్, గఫార్, ధనవర్ష రాజు, ఆర్కే రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.












