-జర్నలిస్టులపై‘థర్డ్ డిగ్రీ,ఉపయోగించడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం..
-ఎస్ఐ శ్రీకాంత్‌తోపాటు బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలి…
– స్వతంత్ర విచారణ జరిపి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి…
– టీయూడబ్ల్యూజే (ఐజేయూ), కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్…
కరీంనగర్ /అక్టోబర్ 14 (మా అక్షరం): గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ వ్యవహారశైలిపై వరుస కథనాలు ప్రచురించిన‘ఏక్ దమ్ న్యూస్,జర్నలిస్టులు సంపత్, ఎడిటర్ పొత్తూరి శేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని, తీవ్రంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ), కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై ప్రతీకార చర్యలకు దిగడం, పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐతోపాటు సంబంధిత పోలీసుల పాత్రపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వరుస కథనాల తర్వాత కేసులు.. అదుపులోకి తీసుకోవడం
బాధితులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ ఆగడాలపై ‘ఏక్ దమ్ న్యూస్’ పత్రిక రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురించింది. ఆ కథనాల నేపథ్యంలో జర్నలిస్టులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటలకు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని, అదే రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కరీంనగర్లో సంపత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అరెస్టుకు ముందు తమకు నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు.అదే రాత్రి సుమారు 9.30 గంటలకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద ఉన్న ఎడిటర్ పొత్తూరి శేఖర్, ఆయన మిత్రుడు పీఈటీ శేఖర్‌ను పోలీసులు వాహనంలో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చట్టబద్ధమైన అరెస్టు ప్రక్రియ గురించి స్పష్టత ఇవ్వకుండా తీసుకెళ్లిన తీరు కిడ్నాప్‌ను తలపించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేటకు తరలించే క్రమంలో కరీంనగర్ బైపాస్ రోడ్డులోని పద్మానగర్ వద్ద పీఈటీ శేఖర్‌ను వదిలిపెట్టి, ఇద్దరు జర్నలిస్టులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
వాహనంలోనే దాడి.. స్టేషన్లలో చిత్రహింసల ఆరోపణలు
పోలీసు వాహనంలో తీసుకెళ్తున్న సమయంలోనే తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బూట్లతో తన్ని, బెల్టులతో కొట్టారని బాధితులు ఆరోపించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత కూడా దాడులు కొనసాగాయని, అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు, ఆ తర్వాత కూడా వివిధ దశల్లో చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. లాఠీలు, బెల్టులు, రబ్బరు టైర్లతో విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు.ఇద్దరినీ కోనరావుపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి, తిరిగి గంభీరావుపేటకు తీసుకొచ్చారన్న ఆరోపణలు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. ఏ పోలీస్ స్టేషన్లో, ఎవరి సమక్షంలో, ఎవరి ఆదేశాలతో దాడులు జరిగాయన్న విషయాలను విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు.
ఫోన్లు తీసుకోవడంతో.. కుటుంబానికి సమాచారం ఆలస్యం
ముగ్గురి మొబైల్ ఫోన్లను పోలీసులు తీసుకోవడంతో వెంటనే ఎవరికీ సమాచారం అందించలేకపోయినట్లు పీఈటీ శేఖర్ తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పద్మానగర్‌లో వదిలిపెట్టిన తర్వాత ఆయన నడుచుకుంటూ రాత్రి సుమారు 11.30 గంటలకు ఇంటికి చేరుకుని, పొత్తూరి శేఖర్ భార్య ప్రశాంతి ఫోన్ నంబర్ తెలుసుకుని విషయం చెప్పినట్లు తెలిపారు.వెంటనే ప్రశాంతి డయల్ 100కు ఫోన్ చేసి తన భర్త ఆచూకీ కోసం సహాయం కోరారని పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వాహనం కదలికలను పరిశీలించిన తర్వాత, రాత్రి సుమారు 2 గంటలకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో ఆమె హుటాహుటిన బయలుదేరి తెల్లవారుజామున సుమారు 3 గంటలకు గంభీరావుపేటకు చేరుకున్నారని వివరించారు. కుటుంబ సభ్యులు ఇలా అర్ధరాత్రి ఆచూకీ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని శ్రీనివాస్ ప్రశ్నించారు.
సీఐ పాత్రపైనా విచారణ జరపాలి
మరుసటి రోజు ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్ కూడా బాధితులపై మరింత దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. కొన్ని ఫోన్ కాల్స్ అనంతరం ఆయన ముందుకు వెళ్లలేదన్న కుటుంబ సభ్యుల వాదనతోపాటు, ఈ ఘటనలో ఆయన పాత్ర ఏమిటన్న విషయంపైనా విచారణ జరపాలని కోరారు. ప్రశాంతి ఆందోళనకు దిగిన తర్వాత కూడా జర్నలిస్టులను వివిధ ప్రాంతాలకు తిప్పి, రాత్రి సమయంలో సిరిసిల్లలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు.
న్యాయమూర్తికి బాధితుల వివరణ.. ఆసుపత్రిలో చికిత్స
న్యాయమూర్తి ఎదుట హాజరైనప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి తమపై జరిగిన దాడులు, దూషణలు, చిత్రహింసలను ఇద్దరు జర్నలిస్టులు వివరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించి, సొంత పూచీకత్తుపై విడుదలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 21 రోజుల వ్యవధికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలిపారు.అనంతరం అదే రాత్రి సుమారు 11 గంటలకు నడవలేని స్థితిలో కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని వివరించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదిక తీసుకుని, అవసరమైన మెరుగైన వైద్యం అందించాలన్నారు.గాండ్ల శ్రీనివాస్ ఆసుపత్రి కి వెళ్లి వారిని కలిసి వివరాలు అడిగి తెలుకొని పరామర్శించారు.
సాక్ష్యాలను భద్రపరచాలి.. బాధ్యులను సస్పెండ్ చేయాలి
గంభీరావుపేట, కోనరావుపేట పోలీస్ స్టేషన్ల సీసీ కెమెరా రికార్డులు, అంబేద్కర్ స్టేడియం, పద్మానగర్ పరిసరాల దృశ్యాలు, పోలీసు వాహనాల ప్రయాణ వివరాలు, స్టేషన్ డైరీలు, అరెస్టు మెమోలు, ఫోన్ల స్వాధీన రికార్డులు, డయల్ 100 కాల్ వివరాలు, వైద్య నివేదికలను వెంటనే భద్రపరచాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రభావానికి తావులేకుండా స్వతంత్ర ఉన్నతాధికారితో విచారణ జరిపించాలన్నారు.ప్రాథమిక ఆధారాల మేరకు ఎస్ఐ శ్రీకాంత్‌తోపాటు దాడుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, క్రిమినల్, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్టులపై నమోదైన కేసు ప్రతీకార చర్యలో భాగమా అన్న విషయాన్నీ స్వతంత్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు రక్షణ కల్పించి, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని కోరారు.
స్పందించకుంటే ఆందోళన బాట
“వార్తల్లో తప్పులుంటే వివరణ ఇవ్వొచ్చు.. ఆధారాలతో ఖండించొచ్చు.. చట్టబద్ధమైన మార్గంలో చర్యలు కోరొచ్చు. కానీ వార్తలు రాసిన జర్నలిస్టులను లాకప్‌లో కొట్టి గొంతు నొక్కాలని చూడటం సహించేది లేదు. చట్టాన్ని కాపాడాల్సినవారే చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రభుత్వం మౌనం వహించకూడదు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే టీయూడబ్ల్యూజే (ఐజేయూ), కరీంనగర్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పడతాం. బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం,,అని ఐజేయూ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ గాండ్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్ లు హెచ్చరించారు.












