– బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న విజ్ఞప్తి…
హుజురాబాద్/ నవంబర్ 20(మా అక్షరం): అర్హులైన చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్షన్లు మంజూరు చేసి ఆదుకోవాలని బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని పద్మాలయ క్లాత్ స్టోర్ ఆవరణలో నిర్వహించిన బీసీ జేఏసీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… గత ప్రభుత్వం చేనేత కార్మికులకు మంజూరు చేసిన రుణాలను ప్రస్తుత ప్రభుత్వం మాఫీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చొరవను స్వాగతిస్తున్నామని తెలిపారు.చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన, జియో ట్యాగింగ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకున్న అర్హులైన చేనేత కార్మికులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్యంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అలాగే చేనేత సహకార సంఘాల మనుగడ కొనసాగించేందుకు యారన్పై సబ్సిడీ మంజూరు చేసి, సహకార సంఘాలను ఆదుకోవడంతోపాటు చేనేత రంగానికి మరింత చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, తాటిపాముల కనకయ్య, మంచి కట్ల విజయకుమార్, ఆళ్ల కేశవులు, రాజన్న సంతోష్, బాబర్, ప్రజా సంఘాల నాయకులు తునికి సమ్మయ్య, తోగరు బుచ్చయ్య, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.












