-రూ.3కే ఐదు లీటర్ల శుద్ధ జలం.. ఉచిత వాటర్ కార్డుల పంపిణీ…
హుజూరాబాద్/నవంబర్22 (మా అక్షరం):మండలంలోని రాంపూర్ గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి, చైర్మన్ సరిత ప్రారంభించారు. గ్రామ ప్రజలకు రూ.3కే ఐదు లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందించనున్నట్లు తెలిపారు. గ్రామస్తులకు రూ.100 బ్యాలెన్స్‌తో ఉచిత వాటర్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వైద్య రంగంలో పనిచేస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలనే లక్ష్యంతో జయన్న ఫౌండేషన్‌ను స్థాపించినట్లు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 7 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1,300 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించినట్లు పేర్కొన్నారు. పేదలకు వివిధ వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందించేందుకు సహకరించామన్నారు.గ్రామాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా మండలవ్యాప్తంగా 20 ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచామని, రాంపూర్‌లో త్వరలో అంతిమయాత్ర రథాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల మొదటి వారంలో గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.చైర్మన్ సరిత మాట్లాడుతూ.. చెల్పూర్, సింగాపూర్, సిర్సపల్లి, కాట్రపల్లి, రాజపల్లి, రాంపూర్ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. శుభకార్యాలకు కూలింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాంట్ నిర్వహణకు గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, ఏడాది పాటు మరమ్మతుల బాధ్యత ఫౌండేషన్ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు












