-రెండో విడత దళితబంధు వెంటనే ఇవ్వాలి
-రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ ను కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పాయిలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ను ఎన్నుకొని దళిత బంధు ఇచ్చారని, అందులో 18 వేల పై చిలుకు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అన్నారు. ఇందులో భాగంగా రెండో విడత సుమారు 2800 కుటుంబాలకు రావాల్సి ఉందని, వారి అకౌంట్లో కూడా డబ్బులు జమ అయి ఉందని, బ్యాంకు వారు అకౌంట్లో ను ఫ్రీజ్ చేశారని ఫ్రీజ్ ఎత్తివేసి వెంటనే దళితులకు రెండో విడత దళిత బంధు అందించాలని విజ్ఞప్తి చేశారు. దళితబంధు రెండో విడత రాదేమోనని నియోజకవర్గంలోని ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో శనిగరం, గోపాల్ పూర్,మాదన్నపేట చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందడం లేదని, వెంటనే చివరి ఆయకట్టు వరకు నిరందించేలా అధికారులను ఆదేశించాలన్నారు.అలాగే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఐసీయూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని వెంటనే ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వాలని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్ష అరవై వేలకు పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామని, గత రెండు నెలలుగా ప్రభుత్వం వారి అకౌంట్లో జీతాలు కూడా వేస్తుందని, మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది అనడానికి సాక్ష్యం కూడా అదే అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు కూడా కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలలో భాగమేనన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన 2,32,308 ఉద్యోగాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు.












