–ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు
-తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ వి.అర్జున్
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: ప్రాణపాయంలో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి అందక బాధితులు ఎదురు చూస్తున్నారని,వారికి సిఏం అర్ఎఫ్ ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ బాధితుల గోడు గోస తగులుతుందని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత రెండు నెలలుగా సిఎంఆర్ఎఫ్ విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం బాధితులు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎందరో అభాగ్యులు వైద్య సహాయం కోసం మెరుగైన చికిత్స కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వారిని వెంటనే సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందరో పేద మధ్యతరగతి ప్రజలకి తక్షణ వైద్య సహాయం కింద నిధులు మంజూరు చేయగా కార్పొరేట్ హాస్పిటల్లో సైతం మెరుగైన వైద్యాన్ని అందించి లక్షలాదిమందికి ప్రాణదానం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు నేటికీ గుండెల్లో గుడి కట్టారన్నారు. ప్రజా అవసరాలు పాటించకపోగా, సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి లో విధానాలు ఖరారు చేయకపోగా,సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి ల కొరకై వైద్యానికి అయ్యే ఎస్టిమేట్లను సైతం పంపొద్దని ఆసుపత్రులకు అంతర్గత ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు అని, రేవంత్ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటన్నారు. అనేకసార్లు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ లు పెట్టి ప్రజలకు అవసరమైన సీఎంఆర్ఎఫ్ పై ఏ ఒక్కనాడు చర్చించకపోవడం విధి విధానాలను ఖరారు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి ప్రజలపై వారికున్న అభిష్టానికి నిదర్శనం అని అన్నారు. ప్రజా పాలన పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలని వేధింపులకు గురి చేస్తున్నారే తప్ప ఆరు గ్యారంటీల సంగతి దేవుడు ఎరుగు ప్రజలకు కనీస హక్కు అయిన ఉచిత విద్య వైద్యం అందించడంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పేరుకే ఆరోగ్యశ్రీ అని, రూ 10 లక్షల పథకం పేరుతో కాగితాలకే పరిమితం చేశారని ప్రతి వైద్యానికి నిమ్స్ ఆసుపత్రికి పంపడంతో వారి మీద అధిక భారం పడుతుందని అన్నారు. వైద్య సహాయం సకాలంలో అందగా ఎందరో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలను అనాధలను చేస్తున్నారని అర్జున్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే సీఎంఆర్ఎఫ్ పై సానుకూలంగా స్పందించి సకాలంలో బాధితులను ఆదుకోవాలని, లేనట్లయితే ఈ విధంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేవంత్ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అర్జున్ హెచ్చరించారు. ఆయన వెంట టియుఎఫ్ నేతలు భూపతి రాకేష్, టి కమలాకర్, ఎం సాయి, విశాల్ తదితరులు ఉన్నారు











