-150 రోజుల కాంగ్రెస్ అబద్ధం మధ్యలో జరిగే ఎన్నిక..
-తెలంగాణలో 10,12 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు..
-బండి సంజయ్ గాలి తిరుగుడు తప్పా బుడ్డ పని కూడా చేయలేదు..
-గుడి కట్టే ఓట్లు అడగాలి అనుకుంటే కెసిఆర్ బ్రహ్మాండమైన యాదాద్రి కట్టారు..
–యువతులకు స్కూటీలు రాలేదు తెలంగాణకు లూటీలు వచ్చాయి..
-కరీంనగర్ ప్రజల గొంతుక వినోద్ కుమార్..
-కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడగడలాడిస్తున్నాడు..
-కౌశిక్ రెడ్డి, వినోద్ కుమార్ వలపట,దాపట్ల జోడెడ్లలా సమస్యలపై పనిచేస్తూ..
-హుజురాబాద్ కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
హుజురాబాద్/మే 11(మాఅక్షరం): కెసిఆర్ పాలనంటే పదేళ్ల నిజం, బిజెపి పాలన పదేళ్ల విషం,150 రోజుల కాంగ్రెస్ అబద్ధపు పాలన మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలంతా ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హుజురాబాద్ లోని సూపర్ బజార్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 10,12 సీట్లు తెలంగాణ ప్రజలు ఇస్తే ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలోకి ఓట్లు అడగడం సరైంది కాదని తెలంగాణలో కాలేజీలు కట్టారా దవఖాణలు నిర్మించారా లేక రైతుబంధు, దళిత బంధు లాంటివి అమలు చేశారో చెప్పి ఓట్లు అడగాలి అన్నారు. 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణలకు ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. పదేళ్ల క్రితం నరేంద్ర మోడీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి అకౌంట్లో నల్లధనం తీసుకొని వచ్చి 15 లక్షలు వేస్తామని చెప్పారని, మరి ఆ 15 లక్షలు ఏవని ఆయన ప్రశ్నించారు. దీంతోపాటు ధరలు తగ్గిస్తా అని చెప్పిన మోదీ ప్రతి వస్తువుపై మరిన్ని ధరలు పెంచారని అన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు 400 ఉన్న సిలిండర్ ధరను 1200 చేశారని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తీరని అన్యాయం చేశారన్నారు. బిజెపి వచ్చిన తర్వాతే దేవుళ్ళు పుట్టినట్టు చెబుతున్నారని బిజెపి పార్టీ మహా అయితే 40 సంవత్సరాలు అవుతుందని, దేవుళ్ళు లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారని దేవుళ్ళని ప్రజలంతా పూజిస్తూనే ఉన్నారని అన్నారు. గుడి కట్టి దానిని చూపిస్తూ ఓట్లు అడగాలంటే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా యాదాద్రి గుడి బ్రహ్మాండంగా కట్టారని అన్నారు. దేవుళ్లను అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం కాదని ప్రజలకు సేవ చేసి కోట్లు అడగాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గెలిచిన తర్వాత చిన్న పని కూడా చేయలేదని, గల్లీలో గాలికి తిరగడం తప్పా జనాల తరఫున ఏరోజు పార్లమెంట్లో మాట్లాడలేదని అన్నారు. కనీసం నియోజకవర్గంలో ఒక్కసారి కూడా తన ముఖం చూపించలేదని ఒక్క పని కూడా చేయలేదన్నారు. 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని బొంద పెట్టాలని అన్నారు. బిజెపిని బొందపెట్టిన దేవుళ్ళకి ఏమాత్రం నష్టం ఉండదు అని అన్నారు.తెలంగాణలో నెర్రలు బారిన నేలలు ఉండేవని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులందరికీ సమృద్ధిగా నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలన్నారు. రైతులకు ఇస్తానన్న 500 బోనస్, రెండు లక్షల రుణమాఫీ,ఆడపడుచులకు 2500, 4000 వృద్ధాప్య పెన్షన్లు, పెళ్లిళ్లు చేసుకున్న ఆడపడుచులకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీలు రాలేదని, తెలంగాణలోకి లూటీలు మాత్రం వచ్చాయన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో కోడె గిద్దెలా దూకుడు ప్రదర్శిస్తున్నారని, రేవంత్ రెడ్డి పరిపాలన పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ గడగడ లాడిస్తున్నారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి దమ్మున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడని, పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను కూడా గెలిపిస్తే వలపట దాపట్ల జోడు ఎడ్ల లాగా ఉంటారని, హుజురాబాద్ సమస్యలను దున్నుతారని అన్నారు. కరీంనగర్ సమస్యలపై పార్లమెంట్లో వినోద్ కుమార్ గొంతు ఎత్తుతారని, అలాంటి నాయకున్ని గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజురాబాద్ మునిసిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.











