-కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం…
-బిఆర్ఎస్ ఎమ్మెల్యే ను ప్రభుత్వం కావాలను టార్గెట్ చేస్తుంది…
-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..
హుజురాబాద్ /సెప్టెంబర్ 12(మా అక్షరం): కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నువ్వు గుండావా ప్రజా ప్రతినిధివా అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. గురువారం హైదరాబాదులోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే గాంధీ ప్రజా ప్రతినిధిగా కాకుండా వీది గుండాల వ్యవహరించాడని ఆయన అన్నారు. గాంధీ స్వయంగా తానే పార్టీ మారలేదని చెప్పినప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కండువా కప్పుకోమని అనడంలో తప్పేముందని అన్నారు. గాంధీ ఇంటికి వెళ్లి సాధారంగా ఆహ్వానిస్తామని చెప్పినా, దాడి చేద్దామని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది గుండాలతో కోడిగుడ్లు, టమాటలతో పాటు ఆయుధాలతో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు ఎంత అసభ్యంగా మాట్లాడిన ఏనాడు దౌర్జన్యాలకు, దాడులకు దిగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గూండా ప్రజా ప్రతినిధులతో రాజ్యమేలుతుందన్నారు. మొన్న ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యేలపై దాడి చేశారని అన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని అన్నారు. పదిరోజులు గడవకముందే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తుందన్నారు. ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ తన వ్యవహార శైలి మార్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.











