– కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు..
కరీంనగర్, తిమ్మాపూర్/నవంబర్20 (మాఅక్షరం):మానకొండూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు మాట్లాడుతూ ….వరంగల్ లో ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటు చేసిన సభ నూనె పాలులాగా ఉందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ జిల్లా ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అలాంటి రేవంత్ రెడ్డి కాలోజి నారాయణరావు విగ్రహావిష్కరణ చేయడం చీకటి రోజులుగానే భావిస్తున్నామన్నారు. సభలో ఇందిరా గాంధీ గురించి కేవలం మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడి మిగిలిన సమయమంతా కెసిఆర్ ను తిట్టడానికే కేటాయించాడని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఇందిరాగాంధీ గొప్పతనాన్ని చెప్పడానికి ఆలోచన రాని రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ డిఎన్ఏ కాదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న డూప్లికేట్ నాయకుడిగా భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇది గుర్తించాలని సూచించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలందరికీ అందినప్పుడే విజయోత్సవాలు చేస్తారని దరఖాస్తు స్వీకరించి ఏడాది గడుస్తున్న ఒక్క లబ్ధిదారునికి ఇల్లు ఇవ్వలేదని,లబ్ధిదారుల జాబితా తయారు చేయకుండా సభ ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుండి బెల్ట్ షాపులు నడుస్తున్నాయని దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో మద్యం నిషేధించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు.అప్పులు చేయని రాష్ట్రం దేశంలో లేదని తెలంగాణలో పెద్దపెద్ద ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర అభివృద్ధికోసం కెసిఅర్ అప్పులు చేశాడే కానీ నీలాగా ప్రభుత్వాన్ని నడపడానికి అప్పులు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 42 శాతం రిజిస్ట్రేషన్లు పడిపోయి రియల్ ఎస్టేట్ మూత పడిందని రేవంత్ రెడ్డికి తెలివి ఉంటే రెవెన్యూను జనరేట్ చేసే ఆలోచనలో దృష్టి పెట్టాలని హితవు పలికారు. అదాని అంబానీలను తలదన్నే రీతిలో మహిళలను కోటీశ్వరులను చేయలేరుగాని వాళ్లను బికారులుగా మాత్రం చేయవద్దని కోరారు. రేవంత్ రెడ్డి తిరుపతిరెడ్డి ఇద్దరు బిర్లారంగాలని కేటీఆర్ హరీష్ రావులు కృష్ణార్జునులని రానున్న రోజుల్లో విశ్వరూపం చూపిస్తారని హెచ్చరించారు.కెసిఆర్ పెట్టిన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వృక్షమై నాటుకుపోయిందని, నీ పదవి నీకు నీ అదిష్టానం పెట్టిన భిక్షని, కేసీఆర్ ది 45 ఏళ్ల రాజకీయ చరిత్రని పార్టీని పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన కెసిఆర్ అంటే రేవంత్ రెడ్డికి గుండెలో దడపుడుతుందని, తెలంగాణ అంటేనే కెసిఆర్ ఆనవాలు అని కెసిఆర్ చిటికెన వేలుకు ఉన్న వెంట్రుకను కూడా రేవంత్ రెడ్డి తీయలేడని అన్నారు. నిత్యానంద స్వామిలా ఒక దీవిని కొనుక్కొని ప్రశాంతంగా ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావులను దూషిస్తున్నాడని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి సిరిసిల్ల సభలో మేము ఏమి సాధించలేదని ప్రజల ముందు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండలాద్యక్షుడు తాళ్ళపెల్లి శేఖర్ గౌడ్, మాజీ జెడ్పీటీసి ఎడ్ల సుగుణాకర్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ ఎడ్ల సత్తీష్, నాయకులు శాతరాజు యాదగిరి,నెల్లి మురళి,ఎరుకల శ్రీనివాస్ గౌడ్,పిట్టల మదు,పురం అనీల్ తదితరులు పాల్గొన్నారు.











