-హాకీ పోటీలను ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..
హుజూరాబాద్/నవంబర్ 29 (మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్రస్థాయి అండర్ 14 బాలబాలికల హాకీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక నిత్యాలు, పరేడ్లతో అలరించారు. ఈ పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలబాలికల 20 జట్ల క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, సీనియర్ హాకీ క్రీడాకారులు కేజర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగం పట్ల ఆసక్తి ఉండాలని, క్రీడలతో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో పోలీసు ఉద్యోగాలను సాధించుకోవడం సులువు అవుతుందన్నారు. క్రీడాకారులు ఆయా రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి మరిన్ని పథకాలను సాధించాలని, రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జట్టుకు పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందడంతోపాటు మానసిక ప్రశాంతత కలిగి యువత క్రీడాకారులు ఎప్పుడూ చురుగ్గా ఉంటారని పేర్కొన్నారు. ఉదయం నుండి పాఠశాల మైదానంలో బాల బాలికలకు వేరువేరు కోర్టులలో క్రీడలు నిర్వహించారు. సామాజిక వేత్త, జెన్ప్యార్డ్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్, పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ ఉదయం పోటీలను ప్రారంభించారు. అనంతరం సామాజిక వేత్త సబ్బని వెంకట్ టోర్నమెంట్ నిర్వహణకు తనవంతుగా 25 వేల రూపాయలను సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు కోచులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ ప్రారంభవేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హాకీ క్లబ్ జిల్లా కార్యదర్శి బండ శ్రీనివాస్, హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎంఈఓ బీ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు, నాగార్జున సీడ్స్ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు, ఎస్టీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, ఎస్టీఎఫ్ కార్యదర్శి సాల్లు సారయ్య, క్రీడల కన్వీనర్ ఏముల రవికుమార్, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.











