-మద్యం సిండికేట్ పై ఫిర్యాదు..
-ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు..
హుజురాబాద్/జనవరి31(మా అక్షరం):
మా ఇల్లు మాకు కావాలంటూ హుజరాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారం కి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు మాట్లాడుతూ… గత ఐదు రోజులుగా నివేశన స్థలాల సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇకపై కాంగ్రెస్ వార్తలు రాయకుండా ఉండాలని ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. 20 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సాధించుకున్న ఇళ్ల స్థలాలపై కాంగ్రెస్ నాయకుడు కేసు వేసినప్పటికీ దానిని ఉపసంహరించడంలో నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ విఫలమయ్యారని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే హుజురాబాద్ ప్రాంతంలో మద్యం మాఫియా సిండికేటుగా ఏర్పడి ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా సిట్టింగ్ లను ఏర్పాటు చేస్తుందన్నారు.అదేవిధంగా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ దందా ను అరికట్టాలని ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.మద్యం సిండికేట్ దందా పై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఉంటుందని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా నాయకులు నంబి భరణి కుమార్,ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, చిలుకమరి సత్యరాజ్, బొడ్డు శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.











