+91 99635 77856

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

– జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్…
– అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలి…
– టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు కుడుతాడి బాపురావు…
– వేములవాడలో విస్తృతంగా సభ్యత్వ నమోదు…
వేములవాడ/ మార్చి 25 (మా అక్షరం):
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు. మంగళవారం వేములవాడ పట్టణ కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బాపురావు మాట్లాడుతూ… జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా అమలుచేయాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని, ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అండగా నిలిచే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమే అని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం పాకులాడే సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సంఘాలు జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్యబద్దంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడే యూనియన్ అని అన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని కోరారు. అనంతరం కొత్త సభ్యులకు ఫెడరేషన్ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి యూసుఫ్, వేములవాడ అధ్యక్షుడు కొప్పుల ప్రసాద్, కార్యదర్శి అవదూత శ్రీధర్, కోశాధికారి నరేందర్, మాజీ అధ్యక్షుడు తొగరు కరుణాకర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !