హుజురాబాద్ /మే19 (మా అక్షరం):సైదాపూర్ ఎస్సై భార్గవ్, కానిస్టేబుల్ ఆకాశ్ రెడ్డి రవికుమార్ లు దళిత యువకుడు బత్తుల మహేందర్‌పై అమానుషంగా దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, హుజురాబాద్ ఎసీపీ కార్యాలయంలో సోమవారం పలు దళిత సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో పోలీస్ అధికారులపై ప్రజలకు గౌరవం ఉండాలి తప్ప భయం కాదని,అయితే ఎస్సై భార్గవ్ వ్యవహార శైలిలో ప్రజలపై నియంతలా ప్రవర్తించడం చాలా దుర్మార్గమని, అతను చట్టాన్ని, రాజ్యాంగాన్ని విస్మరించి దళితుడిని విచక్షణారహితంగా దాడి చేశాడని,మహేందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో, కర్ణబేరాలు కూడా పగిలిపోయాయి,అని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే, ఇలాంటి ఆచారాలకు పాల్పడిన అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం మాదిగ, రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి మారపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల సాగర్, జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.











