– ఆయన హయాంలో పరుగులు తీసిన అభివృద్ది…
– వైఎస్సార్ పాదయాత్రను గుర్తు చేసుకుంటున్న హుజూరాబాద్ ప్రజలు…
– ఉచిత విద్యుత్‌తో ఇక్కడి రైతులకు ఎంతో మేలు…
– జమ్మికుంట వంతెన ఆయన చలవే..
– నేడు వైఎస్సార్ జయంతి…
అల్లి నరేందర్, మా అక్షరం ప్రత్యేక ప్రతినిధి, (జూలై 08): అవకాశం వస్తే అభివృద్ది, సంక్షేమాన్ని పరుగులు ఎలా పెట్టించవచ్చో చేసి చూపించారు ఆ మహానేత వైఎస్సార్. ఆయన పాలన స్వర్ణయుగాన్ని తలపించిందని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ప్రాంతం అభివృద్దికి ఆయన అందించిన తోడ్పాటు మరువరానిదని అంటున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పెద్దాయన చేసిన ‘ప్రజాప్రస్థానం పాదయాత్ర’ సందర్భంగా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన సైదాపూర్ రైతులు సాగునీటి కోసం పడుతున్న అవస్థల గురించి విన్నారు. వాటిని ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా గాలికి వదిలేయలేదు. అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చేందుకు చిత్తశుద్దితో కృషి చేశారు. నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంతో వైఎస్‌కు ఉన్న ఆత్మీయ అనుబంధంపై ‘ మా అక్షరం’ ప్రత్యేక కథనం…
మహానేత చేసిన అభివృద్ది ఇదిగో …
ఉత్తర తెలంగాణ జిల్లాలోనే వ్యాపార కేంద్రంగా ప్రసిద్ది చెందిన జమ్మికుంటలో జమ్మికుంట–కొత్తపల్లి రైల్వే గేటుతో వాహనదారులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైలు వస్తే చాలు గంటల తరబడి రైలు వెళ్లి గేటు తీసే వరకు వేచి చూసేవారు. ఈ క్రమంలో 2008లో ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి జమ్మికుంటకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చారు. ఎడ్ల బండిపై జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వరకు తిరిగారు. ఈ సందర్బంగా ఈ ప్రాంత రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైల్వే గేటు కష్టాలపై వివరించారు. అప్పడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం రైలు గేటు కష్టాలపై వైఎస్‌కు వివరించారు. ఎన్నికల అనంతరం జనవరి 18, 2008లో రూ.24కోట్ల 60 లక్షల వ్యయంతో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేతుల మీదుగా రైల్వే వంతెన మంజూరు కాగా పనులు ప్రార ంభించారు. 13.9.2013లో రైల్వే వంతెన పూర్తి కాగా రైలు కష్టాలు లేకుండా వంతెనపై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. జమ్మికుంట పట్టణంలో రైల్వే వంతెన దివంగంత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకంగా మిగిలిపోయిందని ఈ ప్రాంత వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
వరద కాలువ ఆయన ఇచ్చిన హామీనే …
2003లో ప్రతిపక్ష నేతగా మహానేత వైఎస్సార్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు సైదాపూర్ మండలంలోని పెరకపల్లి ఆకునూర్, ఘనపూర్, గొడిశాల, ఎలబోతారం గ్రామాల మీదుగా హుజూరాబాద్ పట్టణానికి పాదయాత్రగా వచ్చారు. ఆ సందర్భంలో సైదాపూర్ మండలంలో సాగు నీరు అందక తీవ్ర దుర్బిక్షంలో ఉన్నామని రైతులు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్ళారు. అధికారంలోకి రాగానే వరుద కాలువ తెస్తామని హమీ ఇచ్చారు. అనుకున్నట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే వరుద కాలువ పనులు చేపట్టారు. వ్యవసాయ ఆధారమైన హుజూరాబాద్ నియోజకవర్గంలోని రైతులకు ఉచిత విద్యుత్‌తో ఎంతో మేలు జరిగింది. పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఫీజురియంబర్స్‌మెంట్ పథకంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ, ఉపాది అవకాశాలు పొందుతున్నారు.
డబుల్ రోడ్డుకు మోక్షం…
జమ్మికుంట నుండి వీణవంక మీదుగా కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి సింగిల్ రోడ్డుగా ఉండటంతో కొన్నేళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి, కాగా ఈ సమస్యపై అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వైఎస్ 2006లో రూ. 8కోట్ల వ్యయంతో వీణవంక నుండి మానకొండూరు వరకు డబుల్ రోడ్డును మంజూరు చేశారు. ఇప్పటికీ వైఎస్ చేసిన సేవలను ఆయన జయంతి సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.











