-ప్రజా సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధే లక్ష్యం…
-వొడితల ప్రణవ్…
హుజురాబాద్/ జూలై 29(మా అక్షరం):ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. మంగళవారం పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు….కౌశిక్ రెడ్డి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మా దృష్టి అభివృద్ధి మీద, వారి దృష్టి సోషల్ మీడియా రీల్స్ మీద అని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత 18 నెలల్లో ఐదు పాఠశాలలకు కోటి 13 లక్షల నిధులు, నీటి సమస్య పరిష్కారానికి కోటి రూపాయలు ఖర్చు చేశామన్నారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కమ్యూనిటీ హాలుతో అభివృద్ధి బాటలో హుజూరాబాద్..
ఇటీవల ఎస్సీ, మహిళా సంఘాల భవనాలు, ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ, 20 లక్షలతో కమ్యూనిటీ హాలు వంటి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. అలాగే త్వరలో హుజూరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నవారు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులపై శ్రద్ధ చూపలేదని, ఇప్పుడు వాటికి మోక్షం కల్పిస్తున్నామని చెప్పారు.
ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికీ చేరవేస్తున్నాం…
బీఆర్ఎస్ నేతలు గ్యారంటీలు అమలవడం లేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఉచిత బస్సు ద్వారా కోటి 30 లక్షల టిక్కెట్లు మహిళలకు అందించామన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో 9000 కోట్లు రైతు భరోసా నిధులు, సన్న బియ్యం, ఉచిత రవాణా వంటి పథకాలతో ప్రజలకు నెలకు 4 వేల రూపాయల ఆదా కలుగుతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్: బీఆర్ఎస్ పాత్ర రుజువు…
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతల పాత్ర ఆధారాలతో రుజువైందని ప్రణవ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పట్ల అసత్య ఆరోపణలు చేసే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదని అన్నారు. ‘‘ఫస్ట్ లుక్‌కే ఉలిక్కి పడితే, టీజర్‌కు పరిస్థితి ఏంటో చూడాలి’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ-బీఆర్ఎస్ మూలాఖత్..?
బీజేపీ ఎంపీ సిఎం రమేష్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రణవ్… బీఆర్ఎస్–బీజేపీ మధ్య జరిగిన సమావేశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేటీఆర్ బీజేపీ ఎంపీ ఇంటికి ఎందుకు వెళ్లారు? స్వలాభం కోసం పార్టీల విలీనానికి వెనుకాడని వారు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?’’ అని ప్రశ్నించారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రాన్ని సర్వతా అభివృద్ధికి దారి తీస్తోంది. మేం మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటాం. మా చర్యలే మా నమ్మకం’’ అని ప్రణవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్ లు, దేవస్థాన చైర్మన్ లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు











