-టైర్ల కొట్టుకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తి…
-సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం…
-సీసీ ఫుటేజ్ ల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు…
హుజరాబాద్/ మార్చి 07 (మా అక్షరం): పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు టైర్ల కొట్టు ముందు ఉంచిన టైర్లకు నిప్పంటించారు. సుమారు అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఒక వ్యక్తి వచ్చి శ్రీ భవ్య టైర్ వర్క్స్ ముందు ఇనుప కడ్డికి తాళం వేసి పెట్టిన టైర్లకు నిప్పంటించి వెళ్లారు. ఆ దారి గుండా వెళ్తున్న తొగారు జైపాల్ అనే యువకుడు గమనించి వెంటనే బోర్డుపై ఉన్న నెంబర్కు ఫోన్ చేసి యజమాని రవీందర్ కు సమాచారం అందించాడు.
పక్కనే పార్క్ చేసి ఉన్న రెండు వాహనాలు కూడా స్వల్పంగా మంటలు అంటుకోవడంతో జైపాల్ మంటను ఆర్పేసి వాహనాలను దూరంగా పెట్టాడు. రవీందర్ అప్రమత్తమై మంటలను ఆర్పి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిస్థాయిలో ఆర్పి వేశారు. సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు. కొంత ఆలస్యం జరిగితే పెను ప్రమాదం జరిగి ఉండేది. పోలీసులకు ఫిర్యాదు చేయగా పక్కనే ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి సిసిఫుటేజీలు సేకరించి విచారణ చేపట్టారు.













