-హుజరాబాద్‌లో రంగుల కేళి…
– సోదరభావాన్ని చాటిన ప్రెస్ క్లబ్ హోలీ సంబరాలు…
హుజరాబాద్/ మార్చి 04( మా అక్షరం):రంగుల పండుగ హోలీ వేడుకలు హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కులమతాలకు అతీతంగా రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి నాయకులు, అధికారులు, ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా హుజరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.బుధవారం ఉదయం నుండే ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పట్టణంలోని ప్రముఖులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామని రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల బృందం మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, టౌన్ సిఐ కరుణాకర్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధికలను కలిసి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసులకు, ప్రజా సేవలో ఉండే నాయకులకు ప్రెస్ క్లబ్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.పట్టణ ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ చౌరస్తా జర్నలిస్టులు, రాజకీయ నాయకుల కలయికతో రంగులమయమైంది. వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి వార్తా సేకరణలో నిరంతరం బిజీగా ఉండే జర్నలిస్టులు, నాయకులతో కలిసి కేరింతలు కొడుతూ పండుగను ఆస్వాదించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ పండుగ సందేశాన్ని పంచుకున్నారు.
ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్రావు, జన్నోజు భాస్కర్, బండ నరేష్, గోస్కుల రాజకుమార్ పాల్గొనగా, బిజెపి నాయకులు తూర్పాటి రాజు, నరాల రాజశేఖర్, పైళ్ళ వెంకట్రెడ్డి, యమ్సని శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, తిప్పబత్తిని రాజు, కొండ మురళి తదితరులు పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు.సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతను, ప్రేమానురాగాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు పేర్కొన్నారు. ఈ వేడుక హుజరాబాద్ పట్టణంలో ఒక మధుర స్మృతిగా నిలిచిపోయింది.













