+91 99635 77856

దీక్ష శిబిరంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిద్ర.. కొనసాగుతున్న నిరసనలు

హుజూరాబాద్/ ఏప్రిల్07 (మా అక్షరం):హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలోని ప్రతిపాదించిన ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల దీక్ష చేపట్టి, దీక్షా శిబిరంలోనే రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు అక్కడే బస చేశారు.ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ ఏర్పాటు కారణంగా విత్తనోత్పత్తి దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గాలి, నీటి కాలుష్యం పెరిగి పరిసర ప్రాంతాల జీవవైవిధ్యం దెబ్బతింటుందని, సమీప గుట్టల్లో నివసించే నెమళ్లు, వన్యప్రాణుల జీవనం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.

ఉవ్వెత్తున ఎగిసిన నిరసనలు…

గత 16రోజులుగా హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేలాది మంది ప్రజలు ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌తో పాటు మండలంలోని 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినప్పటికీ, అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఉద్యమంలో పాల్గొనడం లేదని విమర్శలు వినిపించాయి.ప్రజల ఆరోగ్యాన్ని, పచ్చని పంట పొలాలను నష్టపరిచే ఇలాంటి ప్రాజెక్టులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నేతలు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !