-కౌన్సిల్ సమావేశంలో 30 అంశాలకు ఆమోదం…
హుజూరాబాద్/ సెప్టెంబరు03(మా అక్షరం): పురపాలక సంఘ సర్వసభ్య సమావేశంలో 30 అంశాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. పురపాలక చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో వివిధ అభివృద్ధి, అత్యవసర పనులకు నిధులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.వినాయక నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు సాధారణ నిధుల నుంచి రూ.9.75 లక్షలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు రూ.27.50 లక్షలు కేటాయించారు. వర్షాకాలంలో లీకేజీలు, మరమ్మతులు, వరద నష్టాల పనులను తక్షణమే చేపట్టేందుకు అత్యవసర సిబ్బంది కోసం ఎమర్జెన్సీ వాహనం ఏర్పాటుకు రూ.5 లక్షలు మంజూరు చేశారు.పురపాలక సంఘంలో పనిచేస్తున్న 146 మంది పారిశుద్ధ్య ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి బీమా కోసం రూ.1.46 లక్షలు కేటాయించారు. డెడ్‌బాడీ ఫ్రీజర్ల మరమ్మతులు, కొత్త ఫ్రీజర్ కొనుగోలుకు రూ.1.15 లక్షలు మంజూరు చేశారు. వివిధ వార్డుల్లో రహదారులపై ఏర్పడిన గుంతల్లో మొరం పోయేందుకు రూ.లక్ష, దెబ్బతిన్న కల్వర్టుల నిర్మాణానికి రూ.2 లక్షలు కేటాయించారు.అలాగే వివిధ వార్డుల్లో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానించింది.ఈ సమావేశంలో వైస్‌చైర్‌పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి.కిషన్, మేనేజర్ ఆర్.భూపాల్‌రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి జి.అభినవ్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ డి.కిరణ్, టెక్నికల్ అధికారి నరేష్, జూనియర్ అకౌంట్స్ అధికారి ఎస్.ఆరతి, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్.గోపాల్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.












