-నీటి కొరతతో ఆందోళనలో భక్తులు.. చివరి వేళ వరుణుడి కరుణతో ఆనందోత్సాహాలు…
హుజురాబాద్ /సెప్టెంబర్ 23 (మా అక్షరం): విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. భక్తుల పాలిట కల్పవృక్షం.. నిమజ్జన వేళ భక్తుల మొర ఆలకించిన గణనాథుడు వరుణుడి రూపంలో కరుణించాడా అన్నట్లుగా హుజురాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వర్షాలు లేక చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోవడం, ఎస్సారెస్పీ కాలువలోనూ నీటి లభ్యత లేకపోవడంతో గణనాథుల నిమజ్జనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపల్ శాఖ ట్యాంకర్ల ద్వారా కొన్ని నీటిని నిలువ చేయడం జరిగింది. కానీ దానికి తోడుగా కురిసిన వర్షం కొత్త ఆశలు నింపింది.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో నీటి కొరత ఏర్పడి గణేశ నిమజ్జన ఏర్పాట్లు సవాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వరుణుడు భారీ వర్షం కురవడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది.‘గణనాథుడే మా మొర ఆలకించాడు.. తన నిమజ్జనం కోసమైనా వర్షాన్ని కురిపించాడు,అంటూ భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.వర్షం రూపంలో వచ్చిన నీరు గణనాథుల నిమజ్జనానికి కొంతైనా తోడ్పడుతుందనే ఆశాభావంతో ఉన్నారు.నీటి కోసం ఎదురుచూసిన వేళ.. నిమజ్జన సమయంలో వర్షం కురవడం భక్తులకు మరపురాని అనుభూతిగా మారింది.












