-బీజేపీ కౌన్సిల్ సభ్యులు రావుల వేణు ఆగ్రహం…
హుజురాబాద్ /సెప్టెంబర్ 24 (మా అక్షరం): వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు పవిత్రంగా పూజించిన గణనాథుల విగ్రహాలను జేసీబీతో ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ కౌన్సిల్ సభ్యులు రావుల వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ… తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనానికి తీసుకొచ్చిన వినాయక విగ్రహాలను ప్రజలు, భక్తులు చూస్తుండగానే జేసీబీతో ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సహించరానివని అన్నారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన స్థాయిలో కాకతీయ కెనాల్‌లో నీటిని అందుబాటులో ఉంచడంలో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాల సంఖ్యను ముందుగానే అంచనా వేసి, కెనాల్‌లో నీటి లభ్యతను పరిశీలించి, అవసరమైన మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అధికారుల వైఫల్యమని విమర్శించారు.హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రావుల వేణు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ బాధ్యత వహించి ప్రజలకు, భక్తులకు సమాధానం చెప్పాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












