-వివాహేతర సంబంధం అంటగట్టారని,అవమానంతో మహిళ ఆత్మహత్య…
-న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ధర్నా…
హుజురాబాద్/జూన్ 25(మా అక్షరం): హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మోతే అఖిల(30) అనే మహిళను వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే నేపంతో బూతులు తిట్టి అవమానించి దాడి చేయగా సదరు మహిళ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై గత రెండు రోజులుగా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం ధర్నాకు దిగారు.
దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా సమాచారం అందుకున్న పోలీసులు వారితో చర్చించి ధర్నాను విరమింప చేశారు. మృతురాలు భర్త మోతే జలంధర్ తెలిపిన వివరాల ప్రకారం…తాను ఇంట్లో లేని సమయంలో మా గ్రామానికి చెందిన పుట్టపాక నాగరాజు భార్య ఉమా, సోదరి గుంపుల తిరుమల, గుంపుల రాజ కుమారులు తన భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి ఇంటి నుంచి బయటకు లాకొచ్చి బూతులు తిట్టి తీవ్రంగా దాడి చేశారని తెలిపారు.అవమానం భరించలేక తన భార్య సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని గూడూరి రాజిరెడ్డి వ్యవసాయ బావి వద్ద తన భార్యకు సంబంధించిన వస్తువులు కనబడగా అందులో వెతకగా శవమై తేలిందని తెలిపారు.దీనిపై మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ తన భార్యపై దాడి చేసి అవమానించిన వ్యక్తులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, దీంతో చేసేదేమీ లేక ధర్నాకు దిగామన్నారు. తన భార్యను అవమానించి దాడి చేసి ఆత్మహత్యకు కారకులైన ఉమా, తిరుమల, రాజకుమార్లపై చర్యలు తీసుకోవాలని జలంధర్ కోరారు. తన భార్యను కొట్టి అవమానించి బావిలో పడేశారనే అనుమానం కూడా ఉందని, దీనిపై పోలీసులు విచారణ చేయాలని జలంధర్ కోరారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు.











