హుజురాబాద్/ జులై 9 (మా అక్షరం): ఆరు నెలలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బూత్ బంగ్లాగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి ఈ భవనంలో అడుగుపెట్టలేదు. వాస్తు దోషం తొలగించాలని ఉద్దేశంతో నేడు ఎలాగైనా దానిలో అడుగు పెట్టాలనే వాస్తు పండితులను ఆశ్రయించారు. క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం ఉందని వాస్తు పండితులు తెలపడంతో దానికి మెరుగులు దిద్దే పనిలో అధికారులు బిజీ అయ్యారు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాస్తు పేరుతో గత ఎమ్మెల్యే ఈటెల కాంపౌండ్ వాల్ ను ధ్వంసం చేసి వేరే చోట నిర్మించిన విషయం తెలిసిందే.! మళ్లీ తర్వాత ఎన్నికైన శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గతంలో వాస్తు దోషం ఉండడం వల్లే ఈటెల తిరిగి ఎమ్మెల్యేగా గెలవలేదని తాను అందులోకి వెళితే తనకు కూడా దోషం పట్టుకుంటుందని గట్టిగా నమ్మాడు. ఇంకేముంది వాస్తు పండితులు సూచనల మేరకు ప్రధాన ద్వారంకు ఎదురుగా ఉండే గుమ్మటాన్ని తొలగించే పనిని అధికారులకు అప్పగించారు.ఆర్ అండ్ బీ అధికారులకు పురమాయించగా నిధులు లేకపోవడంతో రెవెన్యూ అధికారులకు తిరిగి పనిని బదిలీ చేశారు. వారు సిబ్బందిని ఏర్పాటు చేసి గుమ్మటాన్ని రెండు పిల్లర్లను తొలగించే పనిలో బిజీ అయ్యారు. ఈ విషయం రోడ్డు గుండా అటు ఇటు వెళ్లే వారికి కంటపడడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాస్తు ప్రకారం లేదంటూ ధ్వంసం చేస్తున్నారని ముమ్మర ప్రచారానికి తెరలేపారు. అయితే ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన దానిలో ఉండాల్సింది పోయి వారి సొంత భవనం వలే మార్పులు చేర్పులు చేసుకోవడం, తిరిగి ప్రజాధనాన్ని వృధా చేస్తుండడంతో ప్రజలు దానిని గమనిస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే యదేచ్చగా మూఢనమ్మకాల, వాస్తు పేరుతో శాశ్వత పక్కా భవనాలను ధ్వంసం చేస్తూ మళ్ళీ నిర్మిస్తూ డబ్బులు వృధా చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.











