– భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు..
– జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుజాత..
హుజురాబాద్/జూలై 12 (మా అక్షరం): అక్రమ అబార్షన్లు చేస్తూ సమాజానికి తలవంపులు తెచ్చిన హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హెూమ్ ను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణలోనే సంచలనం కలిగిన భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటాహుటిన జిల్లా వైద్య శాఖ అధికారీ డాక్టర్ సుజాత, ఎం సి హెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా జువేరియా, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ బి. చందు లు పోలీసుల సహాయంతో పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హెూమ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేశారు. స్కానింగ్ రూమ్, ల్యాబ్, బెడ్స్ ఇతర గదులను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం లేవని గుర్తించారు. ఆస్పత్రి ముందు ప్రదర్శించిన డాక్టర్ల పేర్లు, ఆసుపత్రికి వచ్చే డాక్టర్ల పేర్లకు సరిపోవడంలేదని తేలింది. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన డాక్టర్లకు బదులుగా వేరే వారు వస్తున్నారని స్పష్టమైనది. బాత్రూములు,రోగులు ఉండే గదులు ఇతర గదులు సక్రమంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కాకుండా, రికార్డులు కూడా పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంహెచ్వో డాక్టర్స్ సుజాత మాట్లాడుతూ… డి ఆర్ ఏ చట్టం ప్రకారం ఆసుపత్రులు నిర్వహించుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తే వాటిని సీట్ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు. అక్రమ అబార్షన్ల రాకెట్ లో ముగ్గురు అరెస్టై రిమాండ్ కు వెళ్లారని, ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్యురాలు ఎవరు అనేది విచారణ జరుగుతుందని ఆమె తెలిపారు. విచారణ అనంతరం సదరు డాక్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలలోని ఆసుపత్రుల యజమానులు నిబంధనల ప్రకారం నడపలేకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. జిల్లాలో,హుజురాబాద్ డివిజన్లో ఆస్పత్రుల తనిఖీ కోసం ప్రత్యేక బృందాలు పరిశీలన చేస్తాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ రంగారెడ్డి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ కాంతారావు, హుజురాబాద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజిద్ హుస్సేన్ డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.











