– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ…
కరీంనగర్/ తిమ్మాపూర్ అక్టోబర్ 18 (మా అక్షరం):మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 150 మెట్రిక్ టన్నుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ…. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారి కాకుండా విడుతల వారీగా మాఫీ చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసిందని ఇది జీర్ణించుకొని ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారని 10 సంవత్సరాల కాలంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో, మీరు చేసిన అప్పు ఎంతో ప్రజలకు చెప్పే ముఖం లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.చెరువులు, కాకతీయ కాలువలు, మిషన్ భగీరథ పేరు మీద ప్రజలను మోసం చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేస్తుంటే ఓర్వటం లేదని అన్నారు. తాను ఈ మండలానికి చెందిన వాడినేనని తనపైన ఆరోపణలు చేసే ముందు సంబంధిత అధికారుల వద్ద పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు. తాను 23 సంవత్సరాలు నుండి రాజకీయంలో ఉంటూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ఎంతోమందికి ఉచితంగా వైద్యాన్ని అందించానని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16వేల డీఎస్సీ పోస్టులు, 16 వందల ఏఈ పోస్టులు, 30 వేల మంది టీచర్ల పోస్టులు ఏర్పరచామని, నెల రోజుల్లో గ్రూపు 1 పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని, దోపిడీకి మారుపేరు టిఆర్ఎస్, కాంగ్రెస్ అంటే అభివృద్ధి అని పేద ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాబట్టి గంగిపల్లి గ్రామ అభివృద్ధి కోసం చెంజర్ల నుండి గంగిపల్లి మీదుగా పచ్చునూరు వరకు రహదారి ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నల్ల గోవిందరెడ్డి సహకార సంఘం డైరెక్టర్లు కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజేపి పార్టీల నాయకులు సొసైటీ పరిదిలోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











