– ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి హితవు..
కరీంనగర్,తిమ్మాపూర్/నవంబర్12(మా అక్షరం):రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై ప్రతిపక్షాలు విమర్శలతో రాద్ధాంతం చేస్తున్నాయని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. కుల గణనకు ఎవరూ సాహసించని తరుణంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ నెల 6వ తేదీ నుంచి రాష్టంలో కుల గణన చేపట్టిందని వివరించారు. కుల గణన చేపట్టడాన్ని స్వాగతించకుండా ప్రతిపక్షాలు రాధ్దాంతం చేస్తున్నాయని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు హేతుబద్ధతలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమేనని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి తప్పుబట్టారు. మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆగమేఘాలపైన కుల గణన చేయిస్తున్నామనడంతో కేటీఆర్ కు రాజకీయ పరిపక్వత లేదని తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. యాస, ప్రాసలతో నోటికేది వస్తే అది మాట్లాడితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, ఆ నమ్మకం లేకనే ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని కేటీఆర్ గుర్తించు కోవాలన్నారు. కుల గణన సర్వేపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు.ఆ పార్టీ నాయకుల మాటల్లోనూ వైరుధ్యాలున్నాయని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ధర్మపాల్ మేష్రామ్ ఆ పార్టీ నాగ్ పూర్ సభలో స్వాగతిస్తున్నట్టు ప్రకటించగా, తెలంగాణ కమలనాథులు మాత్రం కుల గణనపై కువిమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుల వివక్ష, కుల వ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయనే సోయి ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకమని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు పనిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.కులాల గణన చేపట్టాలనే డిమాండ్ ముమ్మాటికీ న్యాయమైనదేనని, ఎప్పటికైనా దీన్ని చేపట్టాల్సిందేనని డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు.ప్రతిపక్షాలు కుల గణనకు ఎదురవుతున్నట్లుగా చెబుతున్న సవాళ్లన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టి పారేశారు.అయితే, కుల గణనను చేపట్టడం ద్వారా ప్రభుత్వ పథకాలను అవసరమైన వర్గాలకు మెరుగ్గా చేరవేయడం సాధ్యమవుతుందన్నారు.ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి కుల గణనను సహకరించాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు.











