హుజురాబాద్/డిసెంబర్ 05(మా అక్షరం): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లను తక్షణమే విడుదల చేయాలని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నివాసానికి పోలీసులు భారీగా మోహరించి కౌశిక్ రెడ్డి తో పాటు హరీష్ రావు ను పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో హుజురాబాద్ నియోజకవర్గం ఒక్కసారిగా భగ్గుమంది. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులను అక్రమ అరెస్టులను నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కేంద్రంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పలువురు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పాలన నడుస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్లు తక్కలపల్లి రాజేశ్వరరావు, గందె రాధిక శ్రీనివాస్ లు ఆరోపించారు. గురువారం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి లను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన మాట్లాడారు. తన ఫోన్ టాపింగ్ జరుగుతుందంటూ పిటిషన్ ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకోకుండా తిరిగి అతనిపైనే కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకలైన కౌశిక్ రెడ్డి, హరీష్ రావు లను అరెస్టు చేసి గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తీరును ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును పక్కకు పెట్టి ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గం లోని పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











