– మన్మోహన్ మృతిపట్ల ఎమ్మెల్యే కవ్వంపల్లి నివాళి…
కరీంనగర్, తిమ్మాపూర్/డిసెంబర్ 27(మా అక్షరం): దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేసిన గొప్ప ఆర్థికవేత్త, సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి సంతాపసూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించారు.అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లడుతూ మన్మోహన్ సింగ్ మృతి దేశానికే దిగ్ర్భాంతి కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప ఆర్థిక మేథావిని కొల్పోయిందన్నారు.1991లో నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ దివాళాకు దగ్గరగా ఉందని, అలాంటి అమానకర పరిస్థితుల నుంచి గర్వంగా తలెత్తుకునేలా దేశాన్ని ఆర్థికంగా శక్తివంతం చేసిన ఘనత మన్మోహన్ కే దక్కుతుందని డాక్టర్ కవ్వంపల్లి కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, పారిశ్రామిక క్రమబద్ధీకరణలతో సంపద సృష్టి జరగడంతో దేశ ఆర్థిక పరిస్థితులు ఉన్నఫళంగా మారిపోయాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మన్మోహన్ సింగ్ కు మాత్రమే ఉందని ఆర్థిక సంస్కరణల పితామహుడైన పీవీ నరసింహారావు బలంగా విశ్వసించారని, పీవీ విధానాల అమలులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గుర్తు చేశారు. ఆర్థికరంగంపైననే కాకుండా ప్రజా పాలనపై కూడా మన్మోహన్ సింగ్ తనదైన ముద్ర వేసుకున్నారని ఆయన చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే అనేక పథకాలను ప్రవేశపెట్టారని, అందులో ఆధార్ కార్డ్, వంద రోజుల పని కల్పనకు ఉద్దేశించిన జాతీయ ఉపాధి హామీ పథకం వంటి మహత్తర పథకాలున్నాయన్నారు. పదేళ్ల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మన్మోహన్ సింగ్ తీర్చిదిద్దారన్నారు. డాక్టర్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రధానమంత్రి సలహాదారుగా, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీ ఛైర్మన్ గా ఎనలేని సేవలందించారని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, బి.రాఘవరెడ్డి, ఊట్కూరి వెంకట రమణారెడ్డి,ఐరెడ్డి మహేందర్ రెడ్డి, గుడిసె అయిలయ్య, పసుల వెంకటి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, పడాల శంకరయ్య, పోలు రాము, రమేశే, మామిడి అనిల్ కుమార్,భాస్కర్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి,రెడ్డిగాని రాజు తదితరులు పాల్గొన్నారు.











