– ఖాళీ చేయాలని అధికారులు చెప్పిన ససే మీరా అంటున్న వాసులు..
-ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?
హుజరాబాద్/మే 27(మా అక్షరం): హుజూరాబాద్ లో ఇరిగేషన్ విభాగం కెసి క్యాంపును గత 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు నివాసం కోసం క్యాంపులో క్వార్టర్లు నిర్మాణం కూడా జరిగింది. కాలక్రమేనా ఇరిగేషన్ ఉద్యోగులు పదవీ విరమణ చెందడం తోపాటు కేసి క్యాంపు లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచి తరలి వెళ్లడంతో ఇక్కడ ఉన్న క్వార్టర్లు ఖాళీ చేయడం జరిగింది. దీంతోపాటు నిర్మాణం జరిగి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు క్వార్టర్లు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే సంబంధిత విభాగం నుంచి క్వార్టర్లు పూర్తిస్థాయిలో తొలగించాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇరిగేషన్ విభాగంతో ఎలాంటి సంబంధం లేని కొన్ని కుటుంబాలు ఇరిగేషన్ అధికారులను పలు విధాలుగా ఒప్పించి ఇక్కడే నివాసం ఉంటున్నారు. క్వార్టర్లలో నివాసం ఉంటున్నందుకు ఇక్కడి ఇరిగేషన్ విభాగానికి కొంత డబ్బులు కూడా చెల్లించేవారు. అసలు నివాస యోగ్యానికి పనికిరాని క్వార్టర్లలో భయం భయం మధ్యన నివాసం కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు క్వార్టర్ల లో పెచ్చులు ఊడుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే చాలావరకు క్వార్టర్లు పూర్తిస్థాయిలో కూలిపోయాయి. అయితే ఇందులో చాలావరకు క్వార్టర్లు ప్రమాదం అంచుల్లో ఉన్నప్పటికీ నివాసం ఉంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని ఖాళీ చేయకుండా అధికారులకు సైతం కొంతమంది ప్రజా ప్రతినిధులతో చెప్పించి మరి అక్కడ నివాసం ఉంటున్నారు. చేసేదేమీ లేక ఇరిగేషన్ అధికారులు కూడా వదిలేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే కచ్చితంగా క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ కోర్టు నుంచి సైతం అధికారులు నివాసం ఉంటున్న వారికి నోటీసులు పంపారు. దీంతో కేసి క్యాంపులో చాలా కుటుంబాలు కాళీ చేసినప్పటికీ కొన్ని కుటుంబాలు మాత్రం నోటీసులను కూడా లెక్క చేయకుండా ఖాళీ చేసేదే లేదని భీష్ముంచుకొని కూర్చున్నారు. అధికారులు అంతటితో ఆగకుండా వారికి వాటర్ సప్లై తో పాటు విద్యుత్ సరఫరాను నిలిపి వేసినప్పటికీ ఖాళీ చేయడం లేదు. కోర్టు పంపిన నోటీసులకు సైతం కౌంటర్ గా కేసు వేయాలని ఆలోచిస్తున్నారే తప్ప ప్రమాదం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. అసలు ఆ క్వార్టర్లలో ఏముందని అక్కడే ఉంటున్నారో అర్థం కావడం లేదని పరువు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ విభాగంతో సంబంధంలేని బయటివారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం రాబోతున్న తరుణంలో వర్షానికి క్వార్టర్లు కూలిపోయి ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరిగేషన్ విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని అక్కడి నుంచి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు పటిష్టంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులతో సాధ్యం కాకపోతే జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కెసి క్యాంపులో నివాసముంటున్న వారిని కాళీ చేయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా క్యాంపులో నివాసం ఉంటున్న కొద్ది కుటుంబాలు వారి మొండితనాన్ని విడనాడి క్యాంపు కాళీ చేయాలని పలువురు కోరుతున్నారు.











