హుజూరాబాద్ జూలై /17(మా అక్షరం): విద్యార్థుల జీవితాలలో కొత్త మార్గాన్ని సృష్టిస్తున్న మోడీ గిఫ్ట్… వాటిని స్వయంగా అందజేస్తూ విద్యార్థుల ఆనందాన్ని పంచుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రజా సంగ్రామ యాత్రలో చూసిన పేద పిల్లల కష్టాలను మర్చిపోలేక… ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల కోసం సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గురువారం ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో కూడా పాల్గొన్న బండి సంజయ్… కొంతసేపు తానే స్వయంగా సైకిల్ తొక్కారు. విద్యార్థుల్లో ఆవిర్భవించిన ఆనందానికి అవధులే లేకుండా, చప్పట్లు, నినాదాలతో హర్షధ్వానాలు చేసారు.
“సైకిల్ – విద్యార్థుల తొలి ఆస్తి”
“ఇది మోదీ గిఫ్ట్. మీ తొలి ఆస్తిగా దీన్ని భావించండి. సద్వినియోగం చేసుకొని బాగా చదవండి. అంబేద్కర్, మోదీ లాంటి నాయకులను స్పూర్తిగా తీసుకోండి” అని బండి సంజయ్ విద్యార్థులకు సూచించారు.
ఇది ప్రభుత్వ నిధులతో కూడిన ప్రాజెక్టు కాదని, తమ నియోజకవర్గంలోని సంస్థల, దాతల సహకారంతో వచ్చిన CSR ఫండ్స్‌తో కొనుగోలు చేసిన సైకిళ్లని వివరించారు.
ప్రజాసంగ్రామ యాత్రలో ఏర్పడిన ఆలోచన..
పాదయాత్ర సమయంలో చెప్పులు లేని చిన్నారుల దుస్థితిని చూసిన సంజయ్… పలువురికి చెప్పులు కూడా కొనిపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. పాలమూరు ప్రాంతంలో ఓ మానసిక వికలాంగుడైన బాలుడు “సైకిల్ లేక స్కూల్‌కు వెళ్లడం లేదు” అని చెప్పిన ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. వెంటనే ఆ బాబుకు సైకిల్ కొనిపెట్టగా, అప్పటి నుంచి స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్తున్నాడని చెప్పారు.
“విద్యలో మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం”
విద్య రంగంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి మాట్లాడిన బండి సంజయ్… 2014లో 68 వేల కోట్ల కేటాయింపుతో ఉన్న విద్యా బడ్జెట్, 2025-26లో లక్షా 28 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. “భేటీ బచావో భేటీ పడావో”, “సమగ్ర శిక్షా అభియాన్”, “నవోదయ”, “ఏకలవ్య”, “సైనిక్ స్కూల్స్” వంటి పథకాల ద్వారా విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు.
త్వరలో మోదీ కిట్స్ పంపిణీ
సైకిళ్లతో పాటు త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న LKG నుండి 6వ తరగతి విద్యార్థులకు “మోదీ కిట్స్” అందజేస్తామని చెప్పారు. వీటిలో స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, పెన్నులు, పెన్సిళ్లు, నోటుబుక్స్, రబ్బర్లు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డా. అశ్విని, జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య, హనుమకొండ జిల్లా విద్యాధికారి వాసంతి, ఆర్డీవో రమేష్, మున్సిపల్ కమిషనర్ కే.సమ్మయ్య బిజెపి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.











