హుజురాబాద్/ అక్టోబర్ 08(మా అక్షరం):
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హుజురాబాద్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.తల్లిదండ్రులు మాట్లాడుతూ…“మా పిల్లలు జమ్మికుంట మాస్టర్స్ హైస్కూల్, ఎస్‌వి హైస్కూల్, విద్యుదయ హైస్కూల్, న్యూ మిలీనియం హైస్కూల్, హుజురాబాద్‌లోని మాంటెస్సోరి, టెట్రా హైస్కూల్స్‌లలో చదువుతున్నారు. కానీ ఈ విద్యాసంస్థలకు ప్రభుత్వం నుండి పిల్లల ఫీజులు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు పుస్తకాలు,భోజనం వంటి సదుపాయాలను నిలిపివేశాయి. పిల్లల భోజనం కోసం మేము అప్పులు చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దసరా సెలవుల తర్వాత మా పిల్లలను స్కూల్‌కి రానివ్వడం లేదు,” అని తెలిపారు.అంతేకాక, “ప్రభుత్వం వెంటనే బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల బిల్లులు విడుదల చేయాలి. లేకపోతే మా పిల్లల విద్య భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది,” అని వారు విన్నవించారు. తల్లిదండ్రులు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతూ, “తగిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో కలిసి ధర్నాలు, రాస్తారోకాలు చేపడతాం” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











