హుజురాబాద్/అక్టోబర్ 08(మా అక్షరం): మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో పోచమ్మ తల్లి దేవత ప్రతిష్టాపన పంచమ వార్షికోత్సవం ఆధ్యాత్మికంగా, వైభవంగా జరిగింది.మాజీ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. పోచమ్మ తల్లి ఆలయం, గ్రామంలోని రెండు కమాన్‌లను రంగురంగుల లైట్లతో, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు.వేడుకల మొదటి రోజు (అక్టోబర్ 6న) వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం నిర్వహించి, అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం మహిళా భక్తుల ఆటపాటలు, కోలాటాలు, మేళతాళాలు, నాట్యాలు, వాయిద్యాల నడుమ పోచమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని వీధులలో ఊరేగించారు.రెండవ రోజు (అక్టోబర్ 7న) భాస్కర్ అయ్యగారు, మణికంఠ, పృధ్వీరాజ్ అయ్యగారు వేదమంత్రాల సాక్షిగా చండీయాగం, కుంకుమపూజలను వైభవంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి విశిష్టతను కృష్ణమాచారి అయ్యగారు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. సాయంత్రం సిరిసపల్లి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం భక్తిపరంగా సాగింది.తృతీయ రోజు (అక్టోబర్ 8న) పోచమ్మ బోనాలు పండగ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించి, పోచమ్మ తల్లి ఆశీస్సులు కోరుకున్నారు.మాజీ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి మాట్లాడుతూ…“పోతిరెడ్డిపేట పోచమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే తల్లిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుపొందింది. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆలయ కమిటీ కృషి విశేషం,” అని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. చివరగా ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.











