హుజురాబాద్/ అక్టోబర్ 12(మా అక్షరం):మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ముంజాల గణేష్ అనే నిరుద్యోగ యువకుడు ఉపాధి కోసం వెళ్లి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… శనివారం ఉపాధి కోసం హనుమకొండలోని ఒక ప్రైవేట్ విద్యుత్ కాంట్రాక్ట్ వద్ద రోజువారీ కూలిగా పని చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్నప్పుడు కరెంటు స్తంభంపై నుండి జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కిడ్నీలు దెబ్బతినడంతో పాటు తలకు గాయాలు కావడంతో పరిస్థితి విషమించి రాత్రి మరణించాడు.మరణించిన గణేష్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఏడాది క్రితం ఆయన తండ్రి కరెంట్ షాక్‌తో మృతి చెందగా, ఇప్పుడు కొడుకు కూడా అదే విధంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గణేష్‌కు తల్లి, ఒక అక్క, బావ ఉన్నారు. తండ్రి మరణంతోనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం ఇప్పుడు గణేష్ మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఆ గ్రామంలో దుఃఖఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అనంతరం అంత్యక్రియల కోసం స్వగ్రామం కాట్రపల్లికి తీసుకువచ్చారు.











