హుజురాబాద్/అక్టోబర్ 18(మా అక్షరం):
హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ జేఏసీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన బంద్ శనివారం విజయవంతంగా జరిగింది.ఉదయం నాలుగు గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుండి బీసీ జేఏసీ నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ డిపో వద్ద బస్సులను నిలిపివేశారు.అనంతరం పట్టణంలోని విద్యా,వాణిజ్య,వ్యాపార సంస్థలు బీసీ జేఏసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వామ్యమయ్యాయి.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీతో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు,అఖిలపక్ష నాయకులు,ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, యువతి-యువకులు,మేధావులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధ్యల వెంకన్న మాట్లాడుతూ…బీసీల జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించి చట్టపరంగా అమలు చేయడంలో విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డుపడడం దురదృష్టకరం. ఈ నిర్లక్ష్యం కొనసాగితే బీసీ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.











