-వామ్మో.. కోతులు…
-వీధుల్లో తిష్ట వేసిన వానరాలు…
-పట్టణ వాసులపై పెరుగుతున్న దాడులు
చోద్యం చూస్తున్న అధికారులు…
హుజురాబాద్/ అక్టోబర్ 23( మా అక్షరం): పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వానరాలు వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. పట్టణ వాసులు బయటికి రావాలంటేనే వానరాలకు భయపడే దుస్థితి పట్టణంలో నెలకొంది. పాఠశాలలకు, కూరగాయలకు, సరుకులు తెచ్చేందుకు అడుగు బయటపెట్టాలంటె వెనుకడుగు వేయాల్సిన గడ్డు పరిస్థితి దాపురించింది. మున్సిపల్ అధికారులు వానరాలను పట్టణంలోకి రాకుండా చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులతో ఆరోగ్యం, ఆస్థి నష్టం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధులు, చిన్నారులపై దాడులు అధికం…
హుజురాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ పై ఇటీవల కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, పాతవాడకు చెందిన ఓ మహిళ, విద్యానగర్ కు చెందిన ఓవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు నిత్యం ఏదో ఒక చోట కోతుల దాడిలో గాయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఇంటి పరిసరాల్లో పనులు చేసుకుంటున్న వృద్ధులు, మహిళలపై కోతులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అలాగే, ఇండ్లలోకి చొరబడి పప్పులు, బియ్యం, కూరగాయలు, తినుబండారాల వంటి వంట సరుకులను ఎత్తుకెల్తున్నాయి. ఇంటి ఆవరణలోని పంపు సెట్లు, వాటర్ ట్యాంకులు, నల్లా కనెక్షన్లను విరగ్గొడుతూ ఆస్థి నష్టం కలిగిస్తున్నాయి. పట్టణంలోని సూపర్ బజార్ లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇళ్ల నుంచి పడేసే వ్యర్థాలకు అలవాటు పడి సమీపంలోని దుకాణ సముదాయాలు తెరిచే వరకు రోడ్ల పై నుంచి కదలడం లేదు. రోడ్లపై నిర్వహిస్తున్న కూరగాయలు, పండ్ల బండ్లపై దాడులకు దిగుతున్నాయి.
పట్టించుకోని అధికారులు….
ఇటీవల బతుకమ్మ సందర్భంగా జరిగిన రివ్యూ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోతుల సమస్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా కోతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కోతల సమస్య నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. కోతులను బంధించి, వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సబ్బని రాజేందర్, సీనియర్ సిటిజన్….

ఉదయం ఇంటి బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. కోతులు గుంపులు గుంపులుగా చేరుకుని ఇండ్లలోకి చొరబడుతున్నాయి. చేతిలలో కర్ర ఉన్నా కోతులు భయపడడంలేదు. కోతులను కర్రతో కొట్టేందుకు వెళితే మీదికే ఉరికివస్తున్నాయి. ఇటీవల కోతులు దాడి చేయగా, నా నడుములో ప్రాబ్లం అయింది. మూడు నెలలు ఇంటికే పరిమితమయ్యాను. ఇప్పుడిప్పుడే కొద్దిగా నడుస్తున్నాను. వాటిని చూస్తేనే భయం వేస్తుంది. పట్టణంలో కోతుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కోతుల బెడదకు అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి.











