చలో హైదరాబాద్ బీసీ జేఏసీ యుద్ధభేరికి హుజురాబాద్ జేఏసీ మద్దతు
హుజురాబాద్ /నవంబర్ 30(మా అక్షరం): బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన ధర్మ యుద్ధభేరికి హుజురాబాద్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుత ధర్నాను నిర్వహించారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ నిరసన చేపట్టినట్లు బీసీ జేఏసీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ తెలిపారు.రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలను నేతలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ శాస్త్రీయ ఆధారాలు లేవని, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం నమ్మకద్రోహమని పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వద్ద నవంబర్ 30న జరగనున్న ధర్మ యుద్ధభేరిలో భారీ సంఖ్యలో హాజరవ్వాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, దీనిపై అఖిలపక్షంగా ప్రధాని వద్ద వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరాన్ని వారు వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కేంద్ర మంత్రులు, ఎంపీలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రాధాన్యతగా ప్రస్తావించాలని కోరారు. లేని పక్షంలో డిసెంబర్ 8న జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా, 9న పార్లమెంట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు వడ్నాల ప్రభాకర్, తాళ్లపల్లి రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, భీమగోని సురేష్ గౌడ్, చీకట్ల సమ్మయ్య గౌడ్, అమరేందర్ గౌడ్ తదితర నాయకులు, యువకులు పాల్గొన్నారు.











