-చివరి విడత పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి…
-జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన…
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
హుజురాబాద్/డిసెంబర్ 16 (మా అక్షరం): మూడో (చివరి) విడతలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2025లో భాగంగా ఈ నెల 17న జిల్లాలోని జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్, వీణవంక, వి.సైదాపూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఆయా మండలాల్లోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.హుజురాబాద్ మండలానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జమ్మికుంట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఇల్లందకుంట మండలానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్‌లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్‌ను పరిశీలించిన కలెక్టర్, పోలింగ్‌కు వెళ్లనున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. చివరి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్‌బాబు తాసిల్దార్ జె.నరేందర్ ఉన్నారు.











