-యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న డా. నాగుల సత్యం గౌడ్…
హైదరాబాద్ / జనవరి 11 (ఆదివారం):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రజాకవి, తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వ గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డుకు ఎంపికై ఘనంగా సన్మానింపబడ్డారు.సత్యం గౌడ్ సామాజిక సేవలు, రచనలు, ఆధ్యాత్మిక కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ మరియు అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ సంస్థల వ్యవస్థాపకుడు కదిరి వెంకట రమణారావు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, సినీ నటి ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీరామ్ పాల్గొని సత్యం గౌడ్‌కు పట్టు శాలువా కప్పి, మెడల్ ధరింపజేసి, బొకే అందజేసి, సన్మాన పత్రంతో పాటు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ….సత్యం గౌడ్ ఆధ్యాత్మిక సేవలు, రచనలు, సామాజిక సేవలు అమూల్యమైనవని, ఆయన దైవాంశ సంభూతుడని ప్రశంసించారు.సత్యం గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మనసును నియంత్రించుకుని, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు,సామాజికవేత్తలు,కవులు,రచయితలు, కళాకారులు, నృత్య కళాకారులు, టీవీ ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు.











