-జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం…
– ఖండించిన హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ..
-బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్..
హుజురాబాద్ /జనవరి 15(మా అక్షరం): అర్ధరాత్రి వేళ సీనియర్ జర్నలిస్టులను (ఎన్ టీ వి) అక్రమంగా అరెస్టు చేయడాన్ని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ (ఐ జె యు) తీవ్రంగా ఖండించింది. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి లు ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామని రవీందర్ లు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు కనీస నిబంధనలు పాటించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. 41 ఏ సి ఆర్ పిసి చట్టం ప్రకారం ముందస్తు నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాలని కోరాలే తప్ప, ముందస్తు సమాచారం లేకుండా దొంగల మాదిరిగా అర్ధరాత్రి ఇళ్లపై పడి అరెస్టు చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.
”ఈ సంఘటన ముమ్మాటికి మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి.సమాజంలోని లోపాలను ఎత్తిచూపే జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సింది పోయి, వేధించడం ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం” అని వారు ధ్వజమెత్తారు. సీనియర్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే కొట్టివేసి,వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని, అరెస్టు చేసిన జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే,పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.











