-రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి…
– బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి…
హుజురాబాద్/ ఫిబ్రవరి 28(మా అక్షరం): రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి ఖాతాలో జమ చేయాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసి 25 రోజులు దాటుతున్నా.. క్యాబినెట్ సమావేశంలోనూ ఆ ప్రస్తావన లేదని తెలిపారు. “రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డికి.. మూసీ సుందరీకరణకు, ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?” అని ప్రశ్నించారు. ఇకనైనా రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా యూరియా కొనుగోలుకు యాప్ లింకు పెట్టడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే యాప్ తో సంబంధం లేకుండా రైతులు నేరుగా యూరియా కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సంగెం ఐలయ్య నాయకులు దయాకర్ రెడ్డి తదితరులున్నారు













