-భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు…
కమలామార్ మార్చి 14 (మా అక్షరం): మండలంలో ఇటీవల వలస కూలీల ప్రవర్తన స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది వలస కూలీలు ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వారిలో కొందరు మద్యం, గంజాయి సేవిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.మద్యం, గంజాయి మత్తులో ఒకరి కుటుంబంపై మరొక కుటుంబం దాడులు చేసుకుంటూ తరచూ గొడవలకు దిగుతున్నారని సమాచారం. చిన్న చిన్న విషయాలకే కర్రలు, పనిముట్లతో పరస్పరం దాడులు చేసుకుంటూ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీస్తున్నారు. ఈ తరహా ఘటనలు పెరుగుతుండటంతో కమలాపూర్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.వీరి ద్వారా ఇక్కడ యువతకు అక్రమ మార్గంలో గంజాయి అందుతున్నట్లు కూడా సమాచారం ఉంది. గంజాయికి బానిసై యువతలో విచిత్ర చేష్టలు పెరిగాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మత్తులో టూ వీలర్లపై అధిక వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరిగినట్లు సమాచారం.ఈ పరిస్థితుల వల్ల రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి కూడా స్థానికులు భయపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారులు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అక్రమ మార్గంలో వస్తున్న గంజాయిని పూర్తిగా అరికట్టడంలో విఫలమవుతున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమలాపూర్ ప్రాంతంలో గంజాయి రవాణా మరియు విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.













